Dharmakruthi  Chapters   Last Page

 

1. ఉపక్రమణము

''తండ్రి హరి జేరుమనియెడి తండ్రి తండ్రి''

నా చిన్నతనంలో - (1968, ఫిబ్రవరి) అప్పుడు ఓ తొమ్మిదేళ్ళుంటాయి ఏమో - ఒక రోజు మా నాన్నగారు మా కుటుంబసభ్యులందరినీ కంచిస్వామివారి దర్శనానికి విజయవాడ తీసుకొని వెళ్ళాలని సంకల్పించారు. మంటాడ సెంటరులో ఆ రోజున ఎందుకనో బస్సులు ఎంతో రద్దీగా ఉన్నాయి. ఎంతసేపు నుంచున్నా బస్సు దొరకలేదు. బండికి ఆరురూపాయలు చొప్పున గూడు రిక్షాలు మాట్లాడారు. బండికి నలుగురైదుగురు ముపై#్ఫ ఐదు కిలోమీటర్లు నామ భజన చేస్తూ విజయవాడ చేరేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది. వేలాది జనానికి స్వామివారు తీర్ధం యిస్తున్నారు. ఒకటే త్రొక్కిసలాటగా ఉంది. నిర్వాహకులు స్వామివారి ఎదుట జనాన్ని నుంచో నియ్యడం లేదు. తీర్థం లైనులో నేను మా నాన్నాగారి వెనుకనే ఉన్నాను. మా వంతు వచ్చింది. మా నాన్నగారిని చూసి స్వామివారు చిరునవ్వు నవ్వారు - మల్లెపూలు విచ్చినట్లు, వెన్నెలలు విరిసినట్లు. తీర్థం ఇస్తూ ''కులాసాగా ఉన్నావా'' అన్నారు. ఆ సందడిలో, తీర్థం పుచ్చుకొనే హడావిడిలో వీరికి ఆ మాట వినిపించినట్లు లేదు. అందునా వారు ఏదో అడిగినట్లు తెలుస్తూనే ఉంది. ఆలోచించుతూ ఉండగానే నిర్వాహకులు తోసివేశారు. తరువాత అడిగారు ''ఏమిట్రా అంటున్నారు'' అని. తెలుసుకొని, ఆ మహానుభావుడికి ఎంత గుర్తో! అంటూ ఆశ్చర్యపోయారు మా నాన్నగారు.

మరి ఆయనకు ఎందుకు ఆ ఆలోచన వచ్చిందో - ఆ స్వామిని మావూరు తీసుకుని రావాలని ఆరునెలలు తిరిగారట. ఓరోజు ''సంధ్యావందనం చేస్తున్నావా'' అని, ఇంకో రోజు ''రుద్రం వచ్చా'' అని, మరో రోజు నూజివీడు రాజా రంగయ్య అప్పారావు గూర్చి మాట్లాడి స్వామి తిప్పుతూనే ఉన్నారు. ఈయన పట్టు వదల లేదు. తోడు మా పెద్దన్నయ్య. ఎలా తిరిగారో! ఎలా సాధించారో!!

ఉళ్లో సందడి మొదలయ్యింది. పెద్దవాళ్ళంతా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. స్వామివారు వస్తే ఎన్ని రోజులుంటారు? ఎంత ఖర్చవుతుంది? ఎవరెవరు ఎంత వేసుకోవాలి? - కొందరు తమకు ముఖ్య భూమిక కోసం ప్రయత్నిస్తుంటే మరి కొందరు వెనుక ముందులాడుతున్నారు. మా నాన్నగారన్నారట- ''డబ్బు విషయంలో చర్చ అనవసరం. ఊళ్లోకి మహాపురుషులు వస్తున్నారు. మీరు నలుగురూ వచ్చి నుంచోవటం కావలసినది. మీరేమిద్దామనుకొన్నారో అది మీ ఇష్టం. మిగతాది అదెంతయినా సరే నే భరిస్తాను''.

పద్ధతి చూస్తే ఈయన ఏ కోటీశ్వరుడో అని భ్రమ పడే అవకాశం ఉంది. ఆబ్బే! పద్దెనిమిది ఎకరాల పొలం - మూడు నాలుగు వందలు వచ్చే ఉద్యోగం-ఎనిమిది మంది సంతానం. నిత్యం కార్య కరామతులు. వచ్చి పోయే అతిధులు. ఇదీ ఈయన స్థితి.

మరి ఏమిటి ఈయన ధైర్యం? ఈయన ధైర్యం గురించి స్వామివారే ఓ కథ చెప్పారు. రెండోసారి మావూరు వచ్చినపుడు స్వామివారు శాయపురం వెళ్ళారు. అక్కణ్నించి తిరుగు ప్రయాణంలో లాంచీ కోసం ఎదురుచూస్తూ రైవస్‌ కాలువ ఒడ్డున కూర్చుని ఉన్నారు. స్వామివారి వద్ద విష్ణుపురాణం ఉంది. యాదృచ్ఛికంగా పేజీ తీశారు. అందులో ఒక కథ - ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకో మంత్రి. చేతిలో ఎముకలేదీ మంత్రికి. దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. తన స్వంత డబ్బే కాదు ఊరంతా అప్పులు చేసి కూడా. రాజుగారికి ఎలానో ఈ విషయం చేరుతుంది. ఋణ దాతలనందరినీ పిలిచి అప్పు తీర్చి వేస్తాడు. మంత్రితో మళ్ళీ అప్పులు చేయవద్దని చెబుతాడు. మళ్ళీ మంత్రి దానధర్మాలు, అప్పులు మొదలు. రాజు తీర్చడం మానడు. పోనీ రాజుగారు ఋణదాతలకే చెప్పవచ్చు కదా ఈ మంత్రికి ఇక అప్పులు ఈయవద్దని. ఆయన అలా చెప్పరు. ఇలా సాగిపోతూ ఉంటుంది కథ. కథ ఆపి సూటిగా మా నాన్నగారి కళ్ళలోకి చూశారు స్వామివారు. మా నాన్నగారి కళ్ళ నిండా నీళ్ళు మరి ఆ రాజే ఈ మంత్రి ధైర్యం, బలం. ఆ సంవత్సరం పంటలు విరగపండి, ధరలు బాగా వచ్చి ముపై#్ప వేల అప్పు తీర్చారట మా నాన్నగారు.

సరి! మా ఇంటికి కంచి స్వామివారు వస్తున్నారనే విషయం మా కర్థమైంది. మాకాలువ వైపు దొడ్డి గోడలు, పెద్ద నాన్నగారింటివైపు గోడలు బద్దలు కొట్టేశారు. కాలవ దాకా పందిళ్లు వేశారు. పెద్ద మంటపం కట్టారు. దానిపై కత్తిరి పాక వేశారు. అక్కడ పూజ పెడతారట. పెద్దగదిలో పెద్ద స్వాములవారు ఉంటారట. పెద్దనాన్నగారింట్లో చిన్న స్వాములవారు ఉంటారట. ఆరోజు ఉదయం నుంచే బళ్ళు రావటం మొదలుపెట్టాయి. ఊరు మీద ఊరు వచ్చిపడినట్లయింది. ఎడ్లబళ్ళు, గుఱ్ఱం బళ్ళు, ఏనుగులు, పరివారజనం ఊళ్ళో ఉన్న అన్ని ఇళ్ళల్లోనూ, అరుగుల మీద ఆ యజమానులతో వారే మాట్లాడుకొని సర్దుకొంటున్నారు. కోటవారింట్లో రావిచెట్టు కింద ఏనుగులని కట్టివేశారు. కాలువ అవతలి దొడ్లో ఆవులు, రోడ్డు మీద బళ్ళ పక్కనే గుఱ్ఱాలు. ఏనుగులకు చెఱుకు చేల లోంచి చెఱుకు గడలు కొట్టి తెచ్చిపడేశారు. మా అందరికి ఎంత పని? ఆవులకు గడ్డి వాములోంచి జనపకట్టలు తీసి అందించాలా! తమాషాగా పచ్చగడ్డి మేస్తున్న గుఱ్ఱాల్నే చూడాలా? చెఱుకు గడల్ని తింటున్న ఏనుగుల్నే చూడాలా? మాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు.

సాయంకాలానికల్లా వెదురుబుట్టలలో అమ్మవారిని అయ్యవారిని తీసుకొని మఠపండితులు రాండోలు మోతతో రానే వచ్చారు. మా అమ్మావాళ్ళంతా హారతులెత్తారు. అప్పటికే మేమంతా మా చుట్టాలందరితో సహా ఇల్లు ఖాళీ చేసేసి మా పిన్నిగారు అద్దెకుంటున్న ఇంటికి వెళ్ళిపోయాము. మా మామయ్యగారింట్లోనేమో బ్రాహ్మణ సంతర్పణకి ఏర్పాటు చేయబడింది. అయ్యవారు అమ్మవారు వచ్చారో లేదో - ఇల్లంతా మడి అయిపోయింది. ఇంట్లోకి మాలాంటి చిన్నపిల్లల్ని అనుమతించరు. మఠంలో నిప్పులు కడిగే ఆచారం మరి. లారీలు లారీలుగా సామాను దిగుతున్నాయి.

ఇంత సంపత్తుకీ అధిపతి రాత్రి పొద్దుపోయిన తరువాత లాంచీలో వచ్చారు. లాంచీకి లంగరు వేసి బడ్డున ఉన్న పందిరి గాటకి కట్టివేశారు. పైన మేనా పెట్టబడి ఉంది. తెల్లవారు ఝామున మేమంతా కాలువలోనే ఒక మునుగు మునిగి, విభూతి పెట్టుకొని కాలువ ఒడ్డున నుంచున్నాం. ఆడవాళ్ళు హారతులివ్వడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలో లాంచీలో కలకలం. పరిచారక వర్గం బాటరీ లైటులతో దారి చూపుతుంటే, సువాసినులందరూ హారతులెత్తగా కోటి చంద్రుల ప్రకాశంతో చంద్రశేఖరులు నేరుగా ఒడ్డుపై కాలు పెట్టారు. ఆహాహా! ఈ కాంతి ఏమిటి? ఈ ప్రకాశం ఏమిటి? కళ్ళ మిరిమిట్లు గొలుపుతున్నాయి. వెన్నెలలు కురిపించిన ఆ చిరునవ్వు, అమృతం చిలికించిన ఆ చిరునవ్వు నా స్మృతి పధంలో ఈ రోజుకీ నిత్య నూతనంగా వెలిగి పోతూనే ఉంది. ఎవరో అందుకున్నారు చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం అంటూ...

అదిగో! ఆ క్షణం నుంచి మా ఆరాధ్య దైవం స్వామి, మాకు తెలిసిన ఒకటే దేముడు మా స్వామి. ఏ కోరిక తీరాలన్నా, అది చాలా చిలిపి కోరికే కావచ్చు, ఏ భయం వేసినా, అది అర్థం లేని భయమే కావచ్చు. చంద్రశేఖర పాహిమాం అన్నదే మా మంత్రం. ఈ రోజుకి కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా అసంకల్పితంగా నా మనస్సు చంద్రశేఖరుల పాదాలను ఆశ్రయిస్తుంది. ఆ పాదాలు నన్ను ఎక్కడ నుంచి ఎక్కడకు తీసుకొని వెళుతున్నాయో నాకు తెలుసు. మాకేమైన పెద్ద చదువులున్నాయనా? కోట్ల అస్తులున్నాయా? అయినా ఎంత వారి ముందైనా తల వంచక ఆత్మాభిమానంతో నిలబడటానికి అండ ఆ పాదాలు కాదా! ఆత్యంతికమైన ఆత్మానుభూతిని అనుగ్రహించే వరకూ ఆ పాదాలు మమ్మల్ని ఆదుకుంటూనే ఉంటాయి.

తరువాత కాలంలో మా అమ్మ, నాన్నగారు అనేక సార్లు శ్రీవారి దర్శనానికి ఒకరిద్దరు పిల్లల్ని వెంట పెట్టుకొని వెళ్ళి వస్తుండేవారు. వస్తూనే పిల్లలందరం చుట్టూ చేరేవారం. స్వామివారి ప్రసాదం ఇచ్చేవారు. మా అమ్మకి ఏ విషయం అయినా పూసగుచ్చినట్లు చెప్పే నేర్పుంది. స్వామివారి గురించి అడిగి అడిగి చెప్పించుకొనే వాళ్ళం. అమ్మకు స్వామివారి గురించి చెప్పడానికి విసుగులేదు. మళ్ళీ మళ్ళీ చెప్పేది. ఈ అయిదడుగుల తెల్లగడ్డపు ముసలి స్వామి మా ఇంటిలో అణువణువునా నిండి పోయారు. ఆ స్వామి కరుణ ఒలికే కళ్ళు, చిరునవ్వు - తల, చేతులు కదిలించే విధానం-ఒకటేమిటి ఆయనకు సంబంధించిన ప్రతి విషయంపై మాకు వ్యామోహమే! ఇంట్లో కృతయుగం ప్రతిష్ఠితమైంది. ఒడుగులయిన వాళ్ళంతా సంధ్యావందనాలు, మిగతా వాళ్ళు ధ్యానాదులు - ఇలా. ఇది మా ఒక్క ఇంటి చరిత్రేకాదు. శ్రీవారి ఆంధ్ర పర్యటనలో అనేక వేల మంది ఇళ్ళల్లో స్వకర్మానుష్ఠానం ఒక విప్లవంలా మొదలయ్యింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. కాషాయం కట్టుకొని వెదురు దండం, చెక్క కమండలం పట్టుకొని తిరిగే ఈ ముసలి స్వామి ఆ విప్లవ నాయకులు.

ఒక రోజు తెల్లవారుఝామున లేచి ముఖం కడుగుకొని ప్రార్థిస్తూ - అంటే మా ఇంట్లో ఒడుగు అవ్వని వాళ్ళకి మంత్రమైన చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర రక్షమాం మంత్రాన్ని స్మరిస్తూ మంచంమీద కూర్చున్నాను. అప్పటికే మా నాన్నగారు, అన్నయ్యలు సంధ్యావందనం మెదలు పెట్టేశారు. ఇంతలో కళ్ళు మూసుకొని స్వామి నామాన్ని స్మరిస్తున్న నాకు తలమీద ఏదో నాడి కొట్టుకొన్న స్పష్టమైన సవ్వడి. ఒక్కొక్కసారి నాడి కొట్టుకొంటున్నప్పుడల్లా మిరిమిట్లు గొలిపే కాంతి, బంగారు రంగులో మిలమిల లాడే కాంతి. దూరంగా ఓ వ్యక్తి, కాషాయాంబరధారి - ముఖం మాత్రం రాముని ముఖం - చేతిలో కోదండమా! ఏమో! నడచి వస్తున్నారు - ''నేనెవర్నీ, అంటూ. స్వామీ! మీరు రాముడన్నాను. అయితే ఆ ముఖం ఇప్పుడు కృష్ణునిదిలా అనిపిస్తోందే! చేతిలోనిది వేణువా? మళ్ళీ అడిగారాయన ''నేనెవర్నీ అంటూ - కృష్ణుడన్నాను, శివుడన్నాను, అమ్మవారన్నాను - చివరకు ఏదో స్ఫురణ. అదీ ఆయనే ప్రసాదించారు. ''అన్నీ మీరే స్వామీ'' అన్నాను. అదిగో! సరిగ్గా అదే క్షణంలో నా స్వామి దండ కమండల ధారియై ¸°వనంతో తళతళలాడిపోతూ దర్శనమిచ్చారు. నే చూసినది ముసలి స్వామి - ఈ నవ యువకుని నేనెలా గుర్తుపట్టానో! బహుశః మొన్న మొన్నటి దాకా నే దర్శనానికి వెళ్ళినప్పుడల్లా నన్ను చూసి - పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పసి బాలుని చూసి, తల్లి నవ్వే ఏ అబ్బురపు కొంటె నవ్వు నవ్వేవారో - ఆ చిరునవ్వు చూసి గుర్తుపట్టానేమో!

మా అమ్మకి ఏదో గ్రహబాధ చాలా కష్టపడింది. ఓ రోజు స్వప్నంలో స్వామి దర్శనం అయింది. అప్పటికి వారిని ఆమె చూడలేదు. ఆ స్వప్నం తరువాత గ్రహబాధ పోయింది. మొట్ట మొదటిసారి అంబిలో దర్శించినప్పుడు ఈ విషయం స్వామితో విన్నవిస్తే ఆయనన్నారట- ''అది నేనే అని నీకేలా తెలిసింది'' అని - ఏమంటుంది మా అమ్మ- ''అప్పుడు తెలియలేదు స్వామీ! చూసిన తరువాత ఇప్పుడు తెలిసిందని'' తప్పుతే.

సరి! కళ్ళు తెరిచిన తరువాత నాకు ఒకటే ఏడ్పు. మన ప్రారబ్ధం ఆ అలౌకికానందాన్ని ఎక్కువసేపు అనుభవింపనీయదు కదా! అలానే కళ్ళు మూసుకొని అయనను చుస్తూనే ఉండి పోరాదా! అదెక్కడి అలౌకికమైన సౌందర్యం తరువాత కాలంలో విజయవాడలో స్వామిని దర్శించాము. స్వామి ఎదురుగా నుంచున్నారు. చెప్పాలని కోరిక ఒకటే ఆవేగం. గొంతుక పూడిపోయింది. మాట పెగలదే. కరుణను వర్షించారు స్వామి. ప్రక్కనున్న రామశాస్త్రిగారిని పిలిచి విషయం నిదానంగా కనుక్కొని వచ్చి చెప్పమన్నారు. బుట్టెడు ద్రాక్ష పళ్ళు ఇచ్చి నువ్వు తినగలిగినన్ని తిని మిగతా పిల్లలందరకూ పంచమని కబురు పంపారు. అయ్యా! ఇంత కాలం ఇంకా ఇంకా తింటూనే ఉన్నాను. ఇంకా కోరిక తీరడం లేదు. అయినా స్వామి ఆదేశంతో రెండో భాగం అయిన పంచే ప్రయత్నమే ఈ పుస్తకం. నాకు వచ్చింది కలా? మెలుకువగానే ఉన్నానే! స్వామివారే నన్ననుగ్రహించడానికి వచ్చారా? లేక ఇది జాగ్రత్య్సప్ననుషుప్త్యావస్థల సంధి కాలంలో కలిగిన దైవిక అనుభూతా? నాకు మటుకు అది స్వామి నాచేతనే పలికించిన వారి ఉపదేశ##మే. ఈ రకంగా మా నాయన గారిచే చేర్చబడి, స్వామిచే స్వీకరించబడి, నా అంతః కరణంలో నెలకొని ఉన్న ఆరాధ్య దైవం నా స్వామి. స్వామివారు ఆంధ్రదేశ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని తమ కరుణామృత వర్షంతొ సస్యశ్యామలం చేసి కంచి చేరారు. స్వామివారి అనుగ్రహాన్ని అనుభవించిన కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితులుగారు,వారి తమ్ముడు వీరభద్రశాస్త్రిగారు, జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రిగారి వంటి మహామహులు మా ఇంటిని పావనం చేసేవారు. మా కందరికి అది పెద్ద పండుగ - రాత్రి రాత్రంతా శ్రీవారి గుణాను కీర్తనమే.

కాలక్రమాన స్వామి కంచిలో, నేను మదరాసులో స్థిరపడిపోయాం మా నాన్నగారుకూడా మద్రాసు వచ్చారు. నాకు తగిన మిత్రులు దొరికారు. స్వామివారి అనుగ్రహం - వారం వారం కొన్నాళ్ళు వారానికి రెండు మూడు సార్లు స్వామిని దర్శించేవాళ్ళం. కొన్నాళ్ళు రాత్రిళ్ళు ఉండిపోయే వాళ్ళం. కొన్ని సార్లు గంటలు తరబడి మాట్లాడారు. కొన్నిసార్లు కరుణా దృష్ఠితో పావనం చేశారు. ఒక్కోసారి తలపంకించేవారు. మరోసారి చేయెత్తి ఆశీర్వదించేవారు. ఒక్కొక్కసారి ఒకో అనుభూతి. ఒక్కోసారి ఒకో తృప్తి. అనేక మంది ఆంతరంగిక భక్తులతో పరిచయమేర్పడింది. స్వామి వారి గురించిన అనేక కథలు, వృత్తాంతాలు తెలిశాయి. ఈ ఆయిదడుగుల ముసలి స్వామి వ్యక్తిత్వం ఇంతింతై అన్నట్లు అంతా నిండిపోయి నన్ను ఆశ్చర్యమగ్నుణ్ణి చేస్తూనే ఉంది. కంచి నుంచి వస్తూనే మా ఇంటి డాబామీదనే ఉన్న మా నాన్నగారి వద్దకు సూటిగా వెళ్ళేవాడిని సాధారణంగా మా నాన్నగారు ఆ సమయంలో స్వామివారి పాదుకలను ముందు పెట్టుకొని జపం చేసుకుంటూ ఉండేవారు. నే వెళ్ళగానే జపం సగంలో ఆపి, ఎంతో ఆనందంగా, అబ్బురంగా వినేవారు మా అమ్మ, అన్నయ్య, తమ్ముడు, అందరూ చేరేవారు.

ఈ పుస్తకం వ్రాస్తున్నంతసేపూ, స్వామిని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆయన తరించడమే కాక మాకు చూపి ఈయనని నమ్ముకోమని చెప్పిన మా నాన్నగారు, నే వ్రాసేవన్నీ జపమాల సగంలో ఆపి వింటూ ఉన్నట్లే అవుపిస్తున్నారు. ఆ ఆనందం, ఆ భక్తి, ఆశ్చర్యం, అబ్బురపాటు, ఆ గగుర్పాటు నా కళ్ళకు కట్టినట్లు కన్పిస్తున్నాయి. మా నాయనగారు కపాలమోక్షం జరిగి గతించారు. బ్రహ్మలీనులయిపోయి ఉండాలి. లేకుంటే బ్రహ్మలోకంలో స్వామివారి పాదుకలను ఎదురుగా ఉంచుకొని సాధన చేస్తూ ఉండాలి. బ్రహ్మలోకంలో ఇంకా సాధన చేస్తూనే ఉన్నట్లయితే, నే వ్రాసే శ్రీవారి చరిత్ర అంతా, శ్రీవారి పాదుకల సాక్షిగా, వారు వింటున్నారు. అదే ఆనందం, అదే భక్తి, అదే ఆశ్చర్యం. అదే గగుర్పాటులతో.

ఈ భాగంలో నేను స్వామివారి ఆవిర్భావం, వీరిని ప్రభావితంచేసే అంశాల గురించి వారు పరిపూర్ణులుగా గుర్తింపబడిన 1919 వరకూ వ్రాశాను. పరిశిష్ఠంలో స్వామివారికి పరమాదర పాత్రులయిన ఇద్దరు మహపురుషులతో వారి సంబంధాన్ని గూర్చి వ్రాశాను. శ్రీవారు ఒక అవతార విశేషమనీ, పరిణామానికి తావులేని పరిపూర్ణులనీ నేను నమ్ముతాను. అయితే నే వ్రాసిన దానిలో తమ ఆచరణ అనుష్టానాల ద్వారా పరిణితి చెంది, జీవన్ముక్తత్వం సాధించిన మహాపురుషునిగా చిత్రించడానికి ప్రయత్నించాను. ఎంత ప్రయత్నించినప్పటికీ వారి అవతార తత్త్వం నా భాషలో చొచ్చుకొని వచ్చి ఉండవచ్చు. మహిమలు ప్రదర్శించడం ఇష్టం లేకపోయినా, తమ ప్రమేయం లేకుండానే వెలువడిన దైవీశక్తులను, తపోవిశేషమునూ ఆయనే ఆపలేకపోయారు కదా!

నాకు శ్రీవారి చరిత్ర అనే ఈ మధురమైన ద్రాక్షపళ్ళను మీతో పంచుకోవాలనే ప్రేరణ జరిగినప్పుడు, సద్గురువులు శ్రీశివానందమూర్తిగారు మద్రాసులో ఉన్నారు. నా అభిప్రాయాన్ని వారికి మనవి చేశాను. శ్రీకృష్ణుని తరువాత హైందవ సంస్కృతిని సమగ్రంగా అర్థం చేసుకొని ఉపదేశించిన బహు కొద్ది మంది మహాపురుషులలో కంచి స్వామి ఒకరు. అని చెబుతూ శ్రీవారి గురించి మీరు చెబుతుంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది. ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది, వ్రాయండి అని ప్రోత్సహించారు. సమకాలీన సాంఘిక రాజకీయ విషయాలపై శ్రీవారి మార్గ దర్శకత్వాన్ని ఎత్తి చూపుతూ వ్రాయవలసిందిగా ఆదేశించారు. ఈ భాగంలో ఆ వివరాలు రాలేదు. మిగతా భాగంలో విస్తృతంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. వ్రాయలని కోర్కె. గురువుగారి ఆదేశ##మే వారి ఆశీస్సుఅనీ, అది సిద్దిస్తుందనీ పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. వారికి నా హృదయపూర్వక నమస్కారములు అర్పిస్తున్నాను.

సాధారణంగా ఒకరిని గొప్పవారిగా గుర్తించి దేశమంతా పొగుడుతుంటే వారిని విమర్శచేయడానికి కొంతమంది బయలు దేరతారు అంతేకాదు, ఇతిహాసాదులలో కొంతమందికి ప్రతినాయక పాత్రలు నచ్చుతాయి. తప్పులేదు, మన ఋషులు ఒకరు కొన్ని తప్పులు చేశారనే దాని కోసం వారి మంచి లక్షణాలు మరుగు పరిచే ప్రయత్నం చేయలేదు. ప్రతి నాయకునిపై ఏర్పడిన ఆదరభావం, నాయకుని సల్లక్షణాలన్నీ అవలక్షణాలుగా కన్పించేట్లు చేయడమే ప్రమాదం. ఇంకా పురాణ పురుషులలో దోషాలు వెతకడం, ప్రతినాయకుని జాతి తమ జాతిగా పరిగణించి, నాయకునిపై, వారిదని వీరనుకుంటున్న జాతిపై, సల్లక్షణాలపై, ధ్వజమెత్తడం ఒక ఫాషన్‌ అయింది. ద్రావిడ కజగం వారు రావణుడే దేముడన్నారు. బ్రాహ్మణులంతా ఆర్యులే అనే వీరికి మరి రావణుడు బ్రాహ్మణుడనే విషయం అవగతం కాలేదు. ప్రాచీన పద్దతి అంతా అణిచివేతకు ప్రాతిపదిక అన్నారు. కానీ ప్రాచీన పద్దతికి నాయకుడైన స్వామివారిని మాత్రం ఎంతో మర్యాద చేశారు. అన్నాదురై లాంటివారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, జాతీయ రహదారిపై స్వామివారు ఎదురుగా కాలినడకన వస్తున్నారని తెలిసినప్పుడు, తన కార్లను రోడ్డు ప్రక్కన పెట్టించి, తాను బయట నుంచుని, స్వామివారు వెళ్లేదాకా కారే ఎక్కలేదు. రామస్వామి నాయకరు లాంటి కరుడు కట్టిన ద్రవిడ నాయకుడు అయన్నొక్కరినీ విమర్శించను అన్నారు. మతానికి తమంతట తాము ప్రతినాయకులుగా నిర్ణయించుకొనిన వారు కూడా వీరిని చూసి వైషమ్యం వదలి గౌరవాన్ని నెరపడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని వివరించడానికి ఈ భాగాల్లో ప్రయత్నిస్తాను.

1894 - 1919 కాలంలో శ్రీవారి జీవితంలో జరిగిన సంఘటనలు ఆశ్చర్యకరమైనవి నేను వ్రాసినవే కాక ఇంకా చాలా విని ఉన్నాను. అయితే ఇంత వరకు ప్రచురింపబడిన పుస్తకాల నుంచీ, శ్రీవారి గురించి తెలిసిన పెద్దల నుంచీ ధృవీకరించు కోవడానికి కుదరలేదు. పరిశిష్ఠంలోని వ్యాసాలు తయారు చేయడానికి రమణాశ్రమం పుస్తకాలు (ముఖ్యంగా సూరి నాగమ్మ గారివి), శృంగేరీ స్వామివారి దివ్య చరిత్ర The Mystic and Seer (శ్రీనటరాజన్‌ వ్రాసినది) రా.. గణపతిగారి వ్యాసాలు ఉపకరించాయి. శ్రీభరణీదరన్‌ ఎంతో సమయాన్ని వెచ్చించి అనేక విషయలు తెలిపారు. పై గ్రంధకర్తలందరికి నా కృతజ్ఞతలు.

శ్రీవారి చరిత్ర వ్రాయడంలో వారి పూర్వాశ్రమ సోదరులయిన శ్రీసాంబమూర్తి శాస్త్రుల వారు, శ్రీటి.యం.పి. మహదేవన్‌, శ్రీకుప్పుస్వామి, శ్రీరా.. గణపతి వ్రాసిన పుస్తకాలు ఎంతో ఉపకరించాయి. ఇంకా శ్రీవైద్యనాధన్‌, బాలు, కాశీకన్నన్‌, డనలప్‌కృష్ణన్‌ వంటి వారి వద్ద వినిన అనేక విషయాలు ఉటంకించ బడినవి. వారందరికి కృతజ్ఞడనై ఉన్నాను.

పీఠాధిపత్యపు తొలిరోజుల సంఘటనలు కొన్ని శ్రీచరణశరణయతులు వ్రాసిన శంభోర్మూర్తిః అన్న సంస్కృత వ్యాసమునుంచి ఉటంకించబడ్డాయి. ఆ పరివ్రాజకులకు నా సాష్ఠాంగ ప్రణామములు వీనిని అనువదించి ఇచ్చిన ప్రియమిత్రులు శ్రీసామవేదం షణ్ముఖ శాస్త్రిగారికి కృతజ్ఞతలు. ప్రచురణ విషయమంతా మా తమ్ముడు చి.. సురేష్‌ మీద పెట్టి నేను నిశ్చింతగా ఉన్నాను. మా మరదలు చి.. సౌ గాయత్రి ఎంతో భక్తి శ్రద్ధలతో డి.టి.పి చేసి పెట్టింది. వీరికి మా అందరి ఆరాధ్య దైవమైన మహాస్వామివారు సమస్త ఐశ్వర్యములను ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను.

ఇంతకు ముందే శ్రీవారి చరిత్రను మన దీక్షితులుగారు, నుదురుమాటి వెంకటరమణగారు, యడవల్లి ఆదినారాయణగారు, విశాఖగారు వంటి పెద్దలు తెలుగులో వ్రాసియున్నారు. వారంతా నాకు మార్గదర్శకులు వారికి నా నమస్కారములు. ''మళ్ళీ ఎందుకయ్యా వ్రాస్తావు. అంటే... సమాధానానికి నా పేరు ఇంటి పేరుగా కల మహాకవిని ఉదహరిస్తాను - తలచిన రామునే తలచెద నేను నా భక్తి రచనలు నావి కాన...

మా మావయ్య ధూళిపాళ శ్రీరామమూర్తిగారు మంచి పండితులు, ప్రఖ్యాత విమర్శకులు. తరతరాలుగా ఈ ధూళిపాళవారు మా ఇంటి అల్లుళ్ళు. మా వంశ చరిత్ర గురించి మానాన్నగారి కంటే ఆయనకే ఎక్కువ తెలుసు. ఆయనకు మా నాన్నగారు శ్రీవార్ని మా ఊరు తీసుకొచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉండేది. ఓసారి స్వామివారి జన్మదినోత్సవసభలో ఆయన. మేమంతా ఏది చేస్తే మహోన్నతంగా ఉంటుందని ఊహించి సంతోషిస్తుంటామో అదిశేషాచలం చేసి చూపించాడని చెప్పారు. ఆయన కామకోటి కారుణ్యం అనే వ్యాసంలో శ్రీవారి అవతారోద్దేశ్యాన్ని ఒక భాగవతశ్లోకం ఉటంకిస్తూ అందంగా యిలా వివరించారు- ''శ్రీ కృష్ణపరమాత్మ అవతరించారట. ఎందుకూ ? దుష్టశిక్షణ, శిష్ఠరక్షణత్యాది కార్యములను పెట్టుకొని జన్మించారంటారు. కానీ, ఇవేమి కాదట. కాదంటే ప్రధానం కాదన్నమాట. మరి ఎందుకయ్యా అంటే ఆ కుజ్జ లేదూ? దాని వంకర తీర్చి దిద్దడం కోసమేనట. మనమంతా కుజ్జలమే! అదీ ఆ శ్లోక భావం'' అని. మనమంతా కుజ్జలమే. స్వామివారు మన జీవితాలను పండించుకోవడానికి కావలసినన్ని అనుభూతులను మిగిల్చి వెళ్ళారు. కోట్లాది మందిని తరింపచేశారు.

పాఠకులు ఈ పుస్తకంలోని మహోన్నతమయిన భావాలన్నీ స్వామివారి చరిత్ర అవడాన వచ్చినవనీ, ఒక్కక్కచోట భావస్పష్టత లేకుంటే అజ్ఞుడనైన నా అసమర్ధత అనీ గ్రహించి, నా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించ ప్రార్దన.

నా మీద అవ్యాజమయిన ఆదరమును, వాత్సల్యమును, అనుగ్రహమును కురిపించెడి కంచి కామకోటి పీఠపు ప్రస్తుత శంకరాచార్యులు శ్రీజయేంద్ర సరస్వతీ స్వామివారియొక్క చరణారవిందములకు, శ్రీశంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారి యొక్క పాదపద్మములకు సాష్టాంగముగా నమస్కరించుచున్నాను.

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం.

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం..

* * * *
 



Dharmakruthi  Chapters   Last Page